కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన యువకుడు బోర్రగల్ల రాజు తన భూ సమస్య పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ, తన ఇంటికి ఆనుకొని ఉన్న అరగుంట గ్రామకఠం భూమిని తాను కొనాలని కోరుకున్నా, గ్రామస్తులు తమకు ఇవ్వకుండా, బోర్రగల్ల సంజీవ్ అనే వ్యక్తి దానిని మరో వ్యక్తి అయిన బోర్రగల్ల లింగుస్వామికి విక్రయించారని ఆరోపించాడు.
భూమి తనకు ఇవ్వకపోతే గ్రామకఠం భూమిని పంచాయతీకి అప్పగించాలని యువకుడు డిమాండ్ చేశాడు. “నా హక్కు భూమిని ఇతరులకు ఎందుకు అమ్మారు? నాకు న్యాయం చేయకపోతే ఈ టవర్ నుండి దిగను” అని టవర్‌పై నుంచి గ్రామస్తులకు, అధికారులకు సవాలు విసిరాడు. ఈ ఘటనతో గ్రామంలో ఒకింత ఉద్రిక్తత నెలకొంది.
స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో, సైదాపూర్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అధికారులు, గ్రామ పెద్దలు కలిసి యువకుడిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. చివరికి పోలీసుల హామీతో, తన సమస్యను పరిశీలించి న్యాయం చేస్తామన్న మాటతో యువకుడు కిందకు దిగాడు.
ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. భూ వివాదాలు పరిష్కారంలో ఆలస్యం కావడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి నిరసనలు వస్తున్నాయని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. యువకుడి ధైర్యమైన నిరసనతో గ్రామంలో భూ వ్యవహారాలపై అధికారుల దృష్టి మళ్లే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.









