కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న 12,292 మంది విద్యార్థులందరికీ శుభవార్త. ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్ ఫీజును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన వేతనం నుండి పూర్తిగా చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వివిధ జిల్లాల కలెక్టర్లకు లేఖ ద్వారా అందజేశారు.
వీరిలో కరీంనగర్ జిల్లాలో 4,847, సిరిసిల్లలో 4,059, సిద్దిపేటలో 1,118, జగిత్యాలలో 1,135, హన్మకొండలో 1,133 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ పరీక్ష ఫీజు చెల్లించడానికి రూ.15 లక్షల పైగా ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూలీ పనులు మాత్రమే చేస్తుండటంతో ఫీజు చెల్లించడం వారికి అసాధ్యమని తెలిసిన బండి సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి బండి సంజయ్ పేద విద్యార్థులకు ప్రత్యేక సహాయాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపాటే కాక, సరస్వతి శిశు మందిరాల్లో చదువుతున్న దాదాపు 20 వేల మంది విద్యార్థులకు ‘‘మోదీ గిఫ్ట్’’ పేరుతో బ్రాండెడ్ సైకిళ్లు పంపిణీ చేశారు.
అతి త్వరలోనే 9వ తరగతి విద్యార్థులకూ సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరంలో ‘మోదీ కిట్స్’ పేరుతో అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, జామెట్రీ బాక్స్, పెన్నులు, పెన్సిళ్లు, స్టీల్ వాటర్ బాటిల్ లను పంపిణీ చేయబోతున్నారు.









