ఇంటర్నెట్లో అశ్లీల కంటెంట్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ వీడియోలు, క్లిప్పులు పిల్లల మనసుల్ని మలినం చేస్తున్నాయని, తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీస్తున్నాయని వాదించారు.
ఈ పిటిషన్ను పరిశీలించిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. పలు సైట్లపై నిషేధం విధించడం వల్ల నేపాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ఉదహరిస్తూ, పిటిషనర్ ను ప్రశ్నించింది.
డివిజనల్ బెంచ్ ఈ పిటిషన్ను తక్షణం విచారించలేమని, ఆగష్టుకు 4 వారాల వాయిదా వేసింది. సీజేఐ ఈనెల 23న పదవీ విరమణ చేయనున్నందున, ఆయన సుముఖంగా లేనట్లు న్యాయవర్గాలు అభిప్రాయపడ్డాయి.
పిటిషనర్ ప్రధానంగా దేశంలో డిజిటలైజేషన్ తర్వాత ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిందని, అందరూ, చిన్నవారు, పెద్దవారు కష్టాల్లేకుండా నెట్ వాడుతున్నారని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని 69ఏ ఆర్టికల్ ప్రకారం, అశ్లీల కంటెంట్ ప్రోత్సహించే వెబ్సైట్లపై నిషేధం విధించే అవకాశం ఉన్నప్పటికీ, కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు.









