మొథా తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం దాటేందుకు దూసుకొస్తోంది. వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం, ఈ తుఫాను మంగళవారం నాడు తీరం తాకనుందని తెలిపింది. దీనికి ముందుగా, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్టణం, భీమవరం తదితర మార్గాల్లో ప్రయాణించాల్సిన 65 రైళ్లు రద్దు చేయబడ్డాయి. అక్టోబర్ 28, 29 తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉండవు.
తుఫాను కారణంగా ఒడిశా మరియు ఆంధ్ర కారిడార్‌లో పలు రైలు సేవలు రద్దయ్యాయి. అలాగే, విశాఖపట్టణానికి వెళ్లాల్సిన అన్ని ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. అధికారులు వాతావరణ పరిస్థితులు మెరుగైన తర్వాత భద్రతా ప్రమాణాల ఆధారంగా రైలు, విమాన సేవలు తిరిగి ప్రారంభిస్తారని తెలిపారు.
మొంథా తీరం దాటనున్న నేపథ్యాన్ని కోస్తాంధ్రలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం రాత్రి ఈ తుఫాను తీరం తాకనుందని తెలిపింది. తుఫాను తీవ్రత కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగినవి. అత్యవసర షెల్టర్లు ఏర్పాటు చేసి, నీరు, విద్యుత్ సప్లయ్ డ్యామేజ్ కాకుండా చూసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఇళ్లలో ఉండి, తుఫాను సద్దుమణిగే వరకూ భద్రతా సూచనలు పాటించాలని ప్రభుత్వం హెచ్చరించింది.









