ప్రేమ వివాహంతో జగిత్యాలలో ఉద్రిక్తత
జగిత్యాల పట్టణంలో మంగళవారం రాత్రి ప్రేమ వివాహం నేపధ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్తవాడకు చెందిన హిందూ యువతి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. తన ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని తెలిపే వీడియోను ఆమె తల్లిదండ్రులకు, పోలీసులకు పంపినట్లు సమాచారం.
రక్షణ కోసం పోలీస్ స్టేషన్ చేరిక
వివాహం అనంతరం యువతి రక్షణ కోసం పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. విషయం తెలుసుకున్న యువతీ తల్లిదండ్రులు, బంధువులు, అలాగే హిందూ సంఘాల నాయకులు కూడా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు.
పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
హిందూ సంఘాల కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు స్టేషన్ గేట్లను మూసివేసి భద్రతను పెంచారు. పరిస్థితి అదుపులోకి రాకుండా ఉండటానికి అదనపు సిబ్బందిని మోహరించారు.
కౌన్సిలింగ్ అనంతరం పరిష్కారం
తర్వాత పోలీసులు యువతీ బంధువులతో మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించారు. యువతి తన ఇష్టంతోనే వివాహం చేసుకుందని స్పష్టంగా చెప్పడంతో పోలీసులు రెండు కుటుంబాలను సముదాయించారు. అనంతరం హిందూ సంఘాలు తమ నిరసనను విరమించి వెనుదిరిగాయి. పోలీసులు పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నారు.









