కర్ణాటక రాష్ట్రంలో తప్పుడు సమాచారం, నకిలీ ప్రచారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురానుంది. రాష్ట్ర అభివృద్ధి, సామాజిక సామరస్యానికి మత ఐక్యత ఎంతో అవసరమని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సోమవారం మంగళూరు సమీపంలోని పుత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
‘‘తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకోవడానికి కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో నకిలీ వార్తలు, మత విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. ఇకపై అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం హెచ్చరించారు.
ఈ మేరకు నూతన చట్టం రూపకల్పన చేయాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్.కే. పాటిల్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, న్యాయశాఖ కలిసి ఈ చట్టాన్ని త్వరితగతిన రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాయని ఆయన తెలిపారు.
మత సామరస్యమే రాష్ట్ర పురోగతికి పునాది అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ‘‘దక్షిణ కన్నడ ప్రజలు సామరస్యాన్ని కాపాడుకోవాలి. ఎవరు మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారో వారు ఎవరో ప్రజలు స్వయంగా గుర్తించాలి’’ అని సీఎం సూచించారు.









