‘‘నన్ను అనేకమంది అనుభవించారు, లైంగికంగా నానా బాధలు పెట్టారు’’ అంటూ వర్జినీయా జిఫ్రీ రాసిన “నోబడీస్ గర్ల్” పుస్తకంలోని పంక్తులు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. చిన్న వయస్సులోనే లైంగిక దాడులకు గురైన జిఫ్రీ, ధనవంతులు, రాజకీయ నాయకులు తమ కోరికల బానిసగా మార్చారని పేర్కొంది. ఏడేళ్ల వయసులోనే తనపై దాడులు ప్రారంభమయ్యాయని, ఎప్‌స్టెయిన్ వద్ద తనకు ఎదురైన దారుణాలను వివరించింది.
జిఫ్రీ పేర్కొన్నట్లుగా, సెక్స్ రాకెట్ నిర్వాహకుడు ఎప్‌స్టెయిన్ తన ప్రైవేట్ దీవిలో పేద బాలికలను మభ్యపెట్టి ధనవంతుల కోసం వాడుకున్నాడు. ఉపాధి పేరుతో ఆ దీవికి వెళ్ళిన టీనేజ్ అమ్మాయిలకు అది ప్రత్యక్ష నరకంగా మారిందని పుస్తకంలో వివరించింది. బాలికలను తరలించే విమానాల్లో కూడా దాడులు జరిగేవని, కొందరు ప్రముఖులు తనను హింసించారని చెప్పింది.
జిఫ్రీ తన పుస్తకంలో బ్రిటన్ రాజు సోదరుడు ప్రిన్స్ ఆండ్రూ పేరు ప్రస్తావించడంతో రాజకుటుంబం మరోసారి దుమారంలో చిక్కుకుంది. ఆమె 17 ఏళ్ల వయసులో ఆండ్రూ తనపై లైంగిక దాడి చేశారని వెల్లడించింది. ఈ వివరణలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేగింది. ఆండ్రూ రాచరిక హోదా, లాంఛనాలను కోల్పోయాడు.
తన జీవితంలో ఎదుర్కొన్న దారుణాలను జిఫ్రీ పుస్తకరూపంలో తీసుకురావడం వెనుక సమాజానికి నిజాలు చూపించాలనే ధ్యేయం ఉందని ఆమె పేర్కొంది. వివాహం తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లైన ఆమె, చివరికి ఆత్మహత్య చేసుకోవడం మరింత విషాదకరం. ఈ వారం విడుదలకానున్న “నోబడీస్ గర్ల్” పుస్తకం ప్రపంచానికి అధికార, డబ్బు, దుర్వినియోగాల వెనుక దాగిన మానవ క్రూరతను మరోసారి చూపించనుంది.









