ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లోని బేడా బుడగ జంగం కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి యువకుడు గల్లంతయ్యాడు. 24 గంటల గాలింపు చర్యల అనంతరం మనోజ్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.
వివరాల్లోకి వెళితే, వీఎం బంజర్‌లోని జంగాల కాలనీకి చెందిన రేపల్లి మనోజ్, పర్వతం శివ అనే ఇద్దరు యువకులు గురువారం తుమ్మలపల్లి వద్ద సాగర్ కాలువకు చేపలు పట్టేందుకు వెళ్లారు. ఓడ్డు పై నుంచి గాలం వేసి చేపలు పడుతున్న సమయంలో మనోజ్ ప్రమాదవశాత్తు కాలువలో జారి పడిపోయాడు.
మనోజ్‌ను రక్షించేందుకు ప్రయత్నించిన శివ కూడా కాలువలోకి దూకాడు. అయితే ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఇద్దరూ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మేకల కాపరి శివ కేకలు విని వెంటనే కాలువలోకి దూకి అతన్ని బయటకు తీసి ప్రాణాపాయం నుంచి కాపాడాడు. అయితే మనోజ్ మాత్రం గల్లంతయ్యాడు.
సమాచారం అందుకున్న వీఎం బంజర్ పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించారు. దాదాపు 24 గంటల ప్రయత్నాల అనంతరం శుక్రవారం మనోజ్ మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామం అంతా దుఃఖభారితమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.









