నల్గొండ జిల్లా మండల పరిధిలోని రేగట్ట గ్రామంలో మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి బాలిక మృతి చెందినట్లు కనగల్లు ఎస్ఐ పి.రాజీవ్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రుల మందలింపులను తట్టుకోలేక ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
స్థానిక సమాచారం ప్రకారం, రేగట్ట గ్రామానికి చెందిన గుంటికాడి నగేష్ – సునీత దంపతుల కుమార్తె దీక్షిత (13) మునుగోడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. దసరా సెలవుల అనంతరం స్కూలు ప్రారంభమైనా, బాలిక తిరిగి పాఠశాలకు వెళ్ళడానికి నిరాకరించిందని తల్లిదండ్రులు తెలిపారు.
ఈనెల 15న తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, దీక్షిత ఒంటరిగా ఇంట్లో ఉండగా పురుగుల మందు తాగినట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పురుగుల మందు వాసన గమనించి అడగగా, “నేనే మందు తాగాను” అని బాలిక చెప్పినట్లు కుటుంబ సభ్యులు వివరించారు.
హుటాహుటిన తల్లిదండ్రులు దీక్షితను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నప్పటికీ, కోమాలోకి వెళ్లిన బాలిక శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో బాలిక మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.









