పేదలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వసతులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్‌లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని, ప్లే గ్రౌండ్‌లు, అవసరమైన తరగతి గదులు, మంచి వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు.
విద్యాశాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించి, సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలోని ప్రభుత్వ స్థలాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని తెలిపారు. ఆ స్కూళ్లలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పించాలని సూచించారు.
విద్యార్థుల పోషకాహార అవసరాల దృష్ట్యా పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమాలను 2026 జూన్ నుండి అమలు చేయాలని సూచించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే తన ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.









