రక్తమార్పిడి భద్రత, రోగి సంరక్షణలో అధునాతన సిరాలజీ పద్ధతుల ప్రాధాన్యాన్ని ఐసీఎంఆర్ సైంటిస్ట్ డా. స్వాతి కులకర్ణి హైలైట్ చేశారు. యాంటీబాడీ స్క్రీనింగ్, యాంటీబాడీ ఐడెంటిఫికేషన్, అడ్సార్ప్షన్, ఎల్యూషన్ వంటి సాంకేతిక పద్ధతులు పేషెంట్ బ్లడ్ మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె వివరించారు. ఈ పద్ధతులు ఖచ్చితమైన రక్త గ్రూప్ ఎంపిక, ట్రాన్స్‌ఫ్యూషన్ ప్రతిచర్యల నివారణలో సహకరిస్తాయని పేర్కొన్నారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఇమ్యునో-హీమటాలజీ, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ విభాగం సంయుక్తంగా “అడ్వాన్స్‌డ్ రెడ్ సెల్ సిరాలజీ” అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్‌లో యాంటీబాడీ స్క్రీనింగ్, ప్యానెల్ ఇంటర్‌ప్రిటేషన్, ఎల్యూషన్, అడ్సార్ప్షన్, కంపాటిబిలిటీ టెస్టింగ్ వంటి నాలుగు ప్రాక్టికల్ సెషన్లు నిర్వహించారు.
వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రెండు క్రెడిట్ అవర్స్ మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో రక్త పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించడం, క్లినికల్ డయగ్నస్టిక్స్‌లో కొత్త పద్ధతుల అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో రక్త సంబంధిత పరిశోధనలకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు దోహదం చేస్తాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు డా. అరుణ్ ఆర్, ఈఎస్ఐసీ హాస్పిటల్ డా. చుంచు శ్రీనివాస్, నిమ్స్ ప్రొఫెసర్ డా. బోనగిరి శాంతి, డా. వుజ్జిని సుధీర్ కుమార్, డా. మురళీ కృష్ణ, డా. మహేష్ కుమార్, డా. సుధా రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు. నిమ్స్ బ్లడ్ సెంటర్ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్, విద్యార్థులు, సహాయక సిబ్బంది కూడా పాల్గొన్నారు.









