రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్‌లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర కేసులు గణనీయంగా తగ్గాయని హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చొంగ్తు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ మంత్రికి వివరించారు.
గతేడాది జనవరి నుండి సెప్టెంబర్ వరకు చికున్‌గున్యా 361 కేసులు నమోదవగా, ఈ ఏడాది 249 మాత్రమే నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అలాగే మలేరియా 226 నుండి 209కు, టైఫాయిడ్ కేసులు 10,149 నుండి 4,600కి తగ్గాయని వెల్లడించారు. డెంగీ కేసులు కూడా గత ఏడాదితో పోల్చితే 2,900 తగ్గాయని వివరించారు. సీజనల్ వ్యాధుల తగ్గుదల రాష్ట్ర ఆరోగ్యశాఖ సమర్థ చర్యలకు నిదర్శనమని మంత్రి అభినందించారు.
అయితే, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మరో నాలుగైదు జిల్లాల్లో స్వల్పంగా కేసులు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో యాంటిలార్వల్ ఆపరేషన్‌ను విస్తృతం చేయాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా పడుతున్న జిల్లాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలు తగ్గిన తర్వాత వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత ముఖ్యమని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లాలని సూచించారు. ఇంట్లో మరియు పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీజనల్ వ్యాధుల బారిన పడితే ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని మంత్రి కోరారు.









