బెజ్జూర్ మండలం మర్తడి గ్రామంలో పురుగుల మందు సేవించి ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన బోర్‌కట్ మల్లయ్య కుటుంబ వివాదం నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి లోనై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సంఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
ఇదంతా జరగడానికి ముందు అదే గ్రామానికి చెందిన మన్నెంపెల్లి ఓనయ్య దంపతులతో మల్లయ్యకు మాటామాటా పెరిగి గొడవ జరిగింది. ఆ ఘటనపై మన్నెంపెల్లి దంపతులు బెజ్జూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మల్లయ్యపై కేసు నమోదు అయ్యింది. ఈ పరిణామం అతనికి మానసిక ఒత్తిడిని కలిగించి ఆత్మహత్యా ప్రయత్నానికి దారి తీసిందని గ్రామస్తులు తెలిపారు.
మల్లయ్య పురుగుల మందు సేవించి మూర్ఛగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు తొలుత అతన్ని బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం కాగజ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మల్లయ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో మల్లయ్య ఆత్మహత్యాయత్నానికి మర్తడి గ్రామానికి చెందిన బషరత్ ఖాన్ కారణమని పోస్టులు వెలువడుతున్నాయి. ఈ విషయంపై బెజ్జూర్ ఎస్సై సర్దాజ్ పాషాను సంప్రదించగా, తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.









