మన దేశంలో డిజిటల్ లావాదేవీలు (Digital Payments) వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో యూపీఐ వినియోగం ఎక్కువగా పెరిగింది. ఈ నేపధ్యంలో కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను పాఠశాలల్లో ఫీజుల వసూలు ప్రక్రియను ఆధునీకరించమని, డిజిటల్ పద్ధతులను అన్వయించమని కోరింది. పారదర్శకతను పెంచడం మరియు చెల్లింపులను సులభతరం చేయడం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.
కేంద్రం సూచన ప్రకారం, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టి), సీబీఎస్‌ఈ, కేవీఎస్, నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్) వంటి సంస్థలు ఫీజుల వసూలు కోసం డిజిటల్ విధానాలను అన్వయించాలి. అడ్మిషన్, పరీక్షల ఫీజుల వసూలుకు యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటివి ఉపయోగించడం ద్వారా ఈ ప్రక్రియ సులభతరం అవుతుంది.
నగదు ఆధారిత చెల్లింపులు డిజిటల్ విధానాల ద్వారా మారడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటుంది. ఫీజులు ఇంటి నుండే చెల్లించగలిగితే స్కూల్ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ విధానం ద్వారా లావాదేవీలలో పారదర్శకత సాధించవచ్చు, తద్వారా అకౌంటింగ్, ట్రాన్సాక్షన్ రికార్డులు సులభంగా ఉండతాయి.
కేంద్రం వెల్లడించినట్లుగా, ఈ మార్పు ‘డిజిటల్ భారత్’ సాధనలో సహకరిస్తుంది. ఆర్థిక అక్షరాస్యత పెరుగుతుందని, తద్వారా డిజిటల్ లావాదేవీలు మరింత విస్తృతం అవుతాయని, విద్యా వ్యవస్థలో ఆధునిక విధానాలను అనుసరించడం ద్వారా పాఠశాలల నిర్వహణ మరింత సమర్థవంతమవుతుందని కేంద్రం విశ్లేషించింది.









