సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో వేగంగా దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంలో మెదక్ జిల్లా మరోసారి ప్రతిభ చాటింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మూల్యాంకనంలో మెదక్ జిల్లా ద్వితీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అవార్డు అందుకున్నారు.
రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ డిస్ట్రిక్ట్, బెస్ట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, బెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ డిస్పోజల్ ఆఫ్ ఆర్టీఐ కేసెస్ వంటి ఏడు విభాగాల్లో ఉత్తములైన వారికి పురస్కారాలు అందజేశారు.
ఆర్టీఐ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పెండింగ్ కేసులు లేకుండా వ్యవహరిస్తున్నందుకు మెదక్ జిల్లా బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్‌గా ఎంపికైంది. కలెక్టర్ రాహుల్ రాజ్ దిశానిర్దేశంలో అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయాన్ని సాధించామని జిల్లా అధికారులు పేర్కొన్నారు.
ఆర్టీఐ దరఖాస్తులను గడువులోపల పరిష్కరించడంలో మెదక్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు తెలిపారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మార్గదర్శకత్వంలో పౌరులకు సమయానుసారం సమాచారం అందించడం, వ్యవస్థ పారదర్శకతను కాపాడడం జిల్లాలో ప్రధాన లక్ష్యమని వారు చెప్పారు. జిల్లాకు అవార్డు రావడం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు కలెక్టర్ రాహుల్ రాజ్‌కు అభినందనలు తెలిపారు.









