ప్రేమ కథలు కేవలం సినిమాలకే, పుస్తకాలకు మాత్రమే పరిమితం కాదని నిరూపించింది ఈ జంట. 63 ఏళ్ల బామ్మను 31 ఏళ్ల కుర్రాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ సంఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. ఇది సాధారణ ప్రేమకథ కాదు — ఫోన్ మరిచిపోయిన సంఘటనే వీరిద్దరినీ కలిపింది. ఆ పరిచయం, డేటింగ్, ప్రపోజల్, మ్యారేజ్… అన్నీ నిజంగా ఒక ఫెయిరీ టేల్ లా సాగాయి.
వివరాల్లోకి వెళ్తే — అజరాషి అనే మహిళ 48 ఏళ్ల వయసులో భర్తతో విడిపోయింది. ఆ తర్వాత సింగిల్ మదర్‌గా తన కొడుకును పెంచింది. పెట్ క్లాత్ బిజినెస్ చేస్తూ, ఇప్పుడు మనవలు, మనవరాళ్లతో సంతోషంగా జీవిస్తోంది. అయితే 2020 ఆగస్టులో టోక్యోలోని షిన్జుకు ప్రాంతంలోని ఓ కెఫేకు వెళ్లినప్పుడు, అక్కడ ఒక మరిచిపోయిన ఫోన్ దొరకడం ఆమె జీవితాన్ని మార్చేసింది.
ఆ ఫోన్ యజమాని కోసం వెతుకుతూ వచ్చిన యువకుడికి ఫోన్ ఇచ్చిన అజరాషి, ఆ తర్వాత అనుకోకుండా బస్సులో మళ్లీ అతనిని కలిసింది. అక్కడి నుంచి స్నేహం మొదలై, రోజూ గంటల కొద్దీ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఒకరోజు కుర్రాడు ఆమెకు ‘నా ప్రిన్సెస్‌గా మారండి’ అంటూ ప్రపోజ్ చేశాడు. ఆమె వయసు పెద్దదని తెలిసినా, ప్రేమ మాత్రం ఆలోచించలేదని చెబుతున్నారు.
చివరికి 2020లో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే — అజరాషి అత్తమ్మ ఆమె కన్నా ఆరేళ్లు చిన్నది! మొదట్లో ఆమె ఈ పెళ్లికి వ్యతిరేకించినా, తన కొడుకు ఒత్తిడితో చివరికి ఒప్పుకుంది. అజరాషి కొడుకు కూడా ఈ బంధానికి మద్దతుగా నిలబడ్డాడు. “నా తల్లికి తోడు కావాల్సినవారు దొరికారు, అంతే నాకు సంతోషం” అని ఆయన అన్నాడు.









