కన్నడ ఇండస్ట్రీలో తన సొగసుతో, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ప్రస్తుతం దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్నారు. 2019లో కన్నడ సినిమాల ద్వారా కెరీర్ ప్రారంభించిన రుక్మిణి, తెలుగు ప్రేక్షకుల మనసుల్లో కూడా స్థానం సంపాదించుకుంటున్నారు. ఇటీవల విడుదలైన అప్పుడో ఇప్పుడు ఎప్పుడో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, కాంతారా: చాప్టర్ 1లో కనకావతి పాత్రతో మరోసారి తన నటనతో మంత్ర ముగ్ధులను చేశారు.
ఈ చిత్రంలో ఆమె పోషించిన నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అందుకే ఇప్పుడు మరో ఆసక్తికరమైన రోల్ రుక్మిణిని వరిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ వారంలోనే ఆ చిత్రానికి పూజా కార్యక్రమం జరగనుందని సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. నయనతార, త్రిష వంటి సీనియర్ నటీమణులను సంప్రదిస్తున్నారని టాక్. అయితే అందరి దృష్టి ఇప్పుడు రుక్మిణి వసంత్ వైపే ఉంది. త్రివిక్రమ్ సినిమా కథలో కీలకమైన నెగిటివ్ రోల్ కోసం ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్. కాంతారా తరహా లోతైన పాత్రలో రుక్మిణి కనిపించబోతున్నారట.
వెంకటేష్ 64 ఏళ్ల వయసులో నటిస్తున్న ఈ చిత్రం కుటుంబ నేపథ్యం, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ మేళవింపుగా రూపొందనుందట. ఇందులో రుక్మిణి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం, వెంకటేష్ నటన, రుక్మిణి ప్రెజెన్స్ కలయికగా ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేసింది.









