ట్రాఫిక్‌లో చిక్కుకోవడం ఎంత ఇబ్బందికరమో అందరికీ తెలిసిందే. రెండు, మూడు నిమిషాలు కదలకపోయినా చాలామందికి అసహనం వస్తుంది. ఐదు, పది నిమిషాలు ఆగిపోతే సహనం తీరిపోతుంది. కానీ, బిహార్ రాష్ట్రంలో ఔరంగాబాద్ నుంచి రోహ్తాస్ వరకు ఉన్న హైవేపై ప్రజలు ఏకంగా నాలుగు రోజులుగా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. రోడ్లపైనే నిద్రపోతూ, తినడానికి ఆహారం లేక, తాగడానికి నీరు లేక, నరకయాతన అనుభవిస్తున్నారు.
తాజాగా జరిగిన భారీ వర్షాల కారణంగా ఔరంగాబాద్-రోహ్తాస్ మధ్య ఉన్న ఢిల్లీ-కోల్‌కతా హైవే వరదనీటితో మునిగిపోయింది. వరద కారణంగా రోడ్డు పైకి వాహనాలు రావడంతో, 65 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు సమన్వయం చేయడంలో విఫలమవడంతో, వాహనాల రద్దీ రోజురోజుకూ పెరిగిపోతోంది.
నాలుగు రోజులుగా హైవేపైనే చిక్కుకుపోయిన డ్రైవర్లు, ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఆహారం దొరకడం లేదు, నీరు లేదు, వాహనాలు కదలడం లేదు” అంటూ బాధను వెల్లడిస్తున్నారు. ట్రక్కులు, కార్లు, బస్సులు, అంబులెన్సులు, పర్యాటక వాహనాలు అన్నీ ఈ జామ్‌లో ఇరుక్కుపోయాయి. అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి.
ఈ భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా వ్యాపారాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరుకు రవాణా నిలిచిపోవడంతో వ్యాపారవేత్తలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించినప్పటికీ, పరిస్థితి పూర్తిగా సాధారణం కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.









